తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆరా తీశారు.
ఇంకా గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో ఠాకూర్ వివరాలు తెప్పించుకున్నారని తెలుస్తోంది.
కాగా, రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కిన జగ్గారెడ్డి.. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.