వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ శుక్రవారంనాడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా సచిన్‌తో సమావేశమయ్యారు. గాంధీలను సచిన్ కలుసుకోవడం వారంలో ఇది రెండోసారి.
సుమారు 45 నిమిషాల పాటు సచిన్, గాంధీల మధ్య సమావేశం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో నాయకత్వ మార్పును పైలట్ ఆశిస్తున్నప్పటికీ, ఆ యోచనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని రాహుల్, ప్రియాంక భావిస్తున్నట్టు చెబుతున్నారు.
కాగా, గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారానికి 44 ఏళ్ల సచిన్ పైలట్ అంగీకరించారా లేదా అనేది వెంటనే తెలియలేదు. రాజస్థాన్ క్యాబినెట్‌లో తన విధేయులకు చోటు కల్పించాలని పైలట్ పట్టుదలగా ఉన్నారు. గాంధీలతో జరిపిన సమావేశంలో ఈ అంశం చర్చించి ఉండొచ్చని అంటున్నారు.
గత ఏడాది జూన్ వరకూ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్ ఆ పదవికి రాజీనామా చేయడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను బుజ్జగించింది. పైలట్‌కు పార్టీ అధిష్టానం చేసిన వాగ్దానం ప్రకారం క్యాబినెట్‌లో మార్పులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ మీనమేషాలు లెక్కపెడుతుండటంతో గాంధీలను పైలట్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.