వ్యక్తిగత ప్రచారానికి ఆరాటపడితే పార్టీకి అపారనష్టం వాటిల్లుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి జహీరాబాద్ వస్తున్నట్లు తనకు సమాచారం లేదని జగ్గారెడ్డి అన్నారు. జహీరాబాద్ వస్తున్నట్లు కనీసం గీతారెడ్డికి కూడా సమాచారం లేదని, వ్యక్తిగత ప్రచారానికే ఆరాటపడితే పార్టీలో కుదరదని ఆయన ఆరోపించారు. రేవంత్ సంగారెడ్డి జిల్లాకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని, విభేదాలు ఉన్నాయని చెప్పేందుకు సమాచారం ఇవ్వట్లేదా? అని ఆయన నిలదీశారు.
పార్టీలో సింగిల్ హీరోగా ఉండాలనుకుంటే కుదరదని జగ్గారెడ్డి హితవు పలికారు. ఒక్కరి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నేతలతో చర్చించకుండానే కార్యక్రమాలు ఖరారు చేసుకోవడం ఏంటని నిలదీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాగా, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు.