తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు అమితాసక్తి చూపుతుంటారు. ఈ అక్షరాభ్యాసం టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా బాసర దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇందులోభాగంగా, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనున్నారు. ఒక్కో టిక్కెట ధర రూ.1,516గా ఖరారు చేశారు. విదేశీయులకు అయితే, రూ.2,516గా నిర్ణయించారు. అలాగే, అమ్మవారికి పూజ చేసిన వస్తువులను కూడా పోస్టు ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా బాసర ఆలయంలో చిన్నారులను పాఠశాలలకు పంపించే ముందు అక్షరాభ్యాసం చేయించేందుకు దేశం నలుమూలల నుంచి తల్లిదండ్రులు ఈ ఆలయానికి వస్తుంటారు. నిత్యం వందలాది మంది భక్తులు ఆలయ సందర్శనకు వస్తుంటారు. ఏటా దాదాపు 80 వేల నుంచి లక్ష మంది పిలలకు బాసర ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం జరుగుతుంది. దీంతో భక్తుల రద్దీ కూడా పెరిగిపోతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో అక్షరాభ్యాసం టికెక్టలను దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అక్షరాభ్యాసం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకుంటే రూ.1516 చెల్లించాల్సి ఉంటుంది.