తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అనేక ప్రాంతాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వేలం పాటల్లో సర్పంచ్ పదవులను ధనవంతులు దక్కించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తీవ్ర పోటీ నెలకొంది.
ఇంకొన్ని చోట్ల పలువురు మగరాయుళ్ళు తమ భార్యలను పోటీలోకి దించుతున్నారు. పలు స్థానాలు మహిళలకు కేటాయించడంతో పురుషులు పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ భార్యలను పోటీలోకి దించుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో సర్పంచి అభ్యర్థిగా నాగుల స్రవంతి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె భర్త ప్రశాంత్ గ్రామస్థుల ముందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో తాను పోటీ చేసినా మీరంతా కలిసి నన్ను ఓడించారు. కనీసం, ఈ సారైనా నా భార్యను గెలిపించండి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్రశాంత్ వేడుకోవడం చూసి ఆయన అనుచరులు సైతం ఎమోషనల్కు గురయ్యారు.