హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోమారు స్వైర విహారం చేశాయి. ఎనిమిదేళ్ళ బాలుడుపై 20కిపై గా కుక్కలు దాడి చేశాయి. పుట్టుకతో మూగవాడైన ఆ చిన్నారి సాయం కోసం అరవలేని నిస్సహాయస్థితిలో తీవ్రంగా గాయపడ్డాు. ఈ హృదయ విదాకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతి రావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి శివగంగ కాలనీలో నివసిస్తున్నారు. వారి కుమారుడు ప్రేమ్ చంద్ (8)కు పుట్టుకతోనే మాటలు రావు. నిన్న ఉదయం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా, ప్రేమ్ చంద్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు అతడిపై దాడి చేసి కిందపడేసి విచక్షణా రహితంగా పీక్కుతిన్నాయి.
ఈ దాడిలో బాలుడి చెవి పూర్తిగా తెగిపోగా, తల, వీపు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యారు. బాలుడు ధరించిన స్వెట్టర్‌ను పట్టుకుని కుక్కలు ఈడ్చేశాయి. అదేసమయంలో అటుగా వచ్చిన ఓ స్థానికుడు ధైర్యం చేసి కుక్కలను రాళ్ళతో కొట్టడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
తీవ్ర రక్తస్రావంతో పడివున్న బాలుడుని స్థానికులు వెంటనే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తెగిపోయిన చెవికి వైద్యులు ఆపరేషన్ చేసినట్టు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు.