Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్‌కు ఎన్ని గంటలకు వెళతారో తెలుసా?

revanth rahul priyanka
, గురువారం, 7 డిశెంబరు 2023 (09:57 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ నిర్వహిస్తారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఇలా ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా హాజరవుతున్నారు. 
 
ఈ అగ్రనేతలకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు రేవంత్ రెడ్డి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమ పార్టీ అగ్రనేతలకు ఆయన స్వయంగా ఆహ్వానం పలుకుతారు. మరోవైపు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఆయన రాష్ట్ర సచివాలయానికి 3 గంటలకు అడుగుపెడతారు. 
 
ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. అధిష్ఠానం పెద్దలతో కీలకమైన చర్చలు జరిపారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అగ్రనేతలను స్వయంగా ఆహ్వానించారు. నిజానికి బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకోవాల్సింది. కానీ బయలుదేరి విమానాశ్రయం దాకా వచ్చిన తర్వాత పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే నుంచి పిలుపు రావడంతో వెనుదిరిగి వెళ్లారు. 
 
ఠాక్రేతో ముఖ్యమైన అంశాలపై చర్చించాక హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అధిష్ఠానం పెద్దలతో చర్చలు, ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్యా విమానాశ్రయంలో ఆయనను కలిశారు. 
 
రేవంత్‌రెడ్డి వెంట సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ,  శ్రీధర్‌బాబు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బలరామ్‌ నాయక్‌ సహా పలువురు ఉన్నారు. కాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే జోన్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు : రైల్వే మంత్రి అశ్విని