హైదరాబాద్ నగరంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యంగా, ఉమ్మడి మేనిఫెస్టో అంశంపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.
ఏపీలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేశారు. సీట్ల పంపకాలు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్టు సమాచారం.
మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. అయితే, ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పాల్గొన్నారా లేదా అన్నది తెలియాల్సివుంది.
ఇదిలావుంటే, ఈ నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాుద చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన భారత ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక బృందం ఏపీకి రానుంది.
ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పార్టీతో కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరందరితీ కలిసి చంద్రబాబు సీఈసీని కలవనున్నారు.