చిన్నిక్రిష్ణుని పుట్టినరోజు బుధవారం. క్రిష్ణాష్టమి పర్వదినాన్ని ఎంతో భక్తితో హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచంలోకి ఇస్కాన్ ఆలయాలన్నింటిలోను భక్తుల రద్దీ ఉంటుంది. కానీ కరోనా సమయం కావడంతో ప్రస్తుతం ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు.
అయితే భక్తులను మాత్రం కొన్ని ఆలయాల్లో అనుమతించనున్నారు. ఇస్కాన్ లాంటి ఆలయాల్లో మాత్రం సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులను అనుమతించడానికి నిర్వాహకులు సిద్థమవుతుంటే టిటిడి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయనుంది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీక్రిష్ణస్వామి వారి ఆలయంలో గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. గోకులాష్టమి రోజైన బుధవారం ఉదయం శ్రీక్రిష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవలు జరుగనున్నాయి. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు గోపూజ, గోకులాష్టమని ఆస్థానం నిర్వహిస్తారు. అదే విధంగా ఆగష్టు 13వ తేదీన గురువారం ఉట్లోత్సవం పురస్కరించకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
కోవిడ్-19 నిబంధనల మేరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో గోకులాష్టమని ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.