కళంకాలను తొలగించేవాడు కల్కి. పాప ప్రక్షాళన చేసేందుకే ఈ కల్కి అవతారం. ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది. పాపాత్ములను నశింపజేసి ధర్మాన్ని కాపాడేందుకు కల్కి అవతరిస్తాడు.
ఎనిమిది దివ్య శక్తులతో, ఎనిమిది విశిష్ట గుణాలతో విరాజిల్లే కల్కి తెల్లని గుర్రంపై వస్తాడు. తన తపశ్శక్తితో పరమేశ్వరుడుని మెప్పించి ఆయుధవాహనాదులను పొంది సహస్రాధిక శక్తిమంతుడై కలియుగంలో అధర్మాన్ని రూపుమాపి నాలుగు పాదాలపై నిలిచే ధర్మదేవతతో కూడిన సత్యయుగాన్ని పునస్సాధిస్తాడు.
కల్కి ధర్మాన్ని స్థాపించినంతనే కలియుగం అంతమై తిరిగి కృతయుగం ఆరంభమవుతుంది. కృతయుగం రాగానే కల్కి తల్లిదండ్రులు బదరికాశ్రమంలో నివశిస్తారు. వారికి మరణం లేదు. ఇరువురు కల్కితో వైకుంఠానికి చేరుకుంటారు.
కలియుగాంతంలో దుష్టుల వెంటపడి సంహరించే కల్కి అల్లాడుతూ పరుగులు పెడుతున్న సాధు ప్రజలను కూడా వెంటపడి మరీ కాపాడుతాడని విష్ణుపురాణం చెపుతోంది. కల్కికి ఇరువురు పుత్రులు వుంటారు. వారితో ధర్మ పాలన చేయిస్తాడు. ధర్మం నాలుగు పాదాలా స్థిరంగా నిలిచిన తర్వాత యోగశక్తితో దేహాన్ని విడిచి శ్రీహరిగా వైకుంఠం చేరుకుంటాడు.