శ్రావణ పౌర్ణమినే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళు-అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ.
మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా ప్రేత, పిశాచ బాధ, దుష్ట శక్తుల బాధలుండవని, అనారోగ్యం, అశుభాలు ఏమాత్రం దరిచేరవని కృష్ణుడు చెప్తాడు.
ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా కృష్ణుడు వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది.
మహాబలవంతుడు, దానశీలుడు, రాక్షస రాజైన బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తిలో బంధించాడు. అంతటి విష్ణు శక్తి కలిగిన రక్షాబంధన్‌ను నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది... రాఖీని కడుతూ.. అన్నదమ్ముల నోటికి తీపిని అందిస్తారు అన్నదమ్ములు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వేడుకుంటూ ఈ రాఖీ కడతారు.
అలాగే రాక్షసుల రాజు అయిన బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రహ్మాణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది.
తన ప్రత్యక్ష దైవమైన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు. అలా రాఖీ పౌర్ణమిని దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.