శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం, శుక్రవారం అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైనది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని విశ్వాసం. వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శుభప్రదం.
అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లె మాలను సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే రుణ విముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని పండితుల వాక్కు. ఈ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలు శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం. ఆ తర్వాత నాగుల చవితి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి ఈ మాసంలోనే వస్తాయి.
ఈ మాసంలో ప్రతి మంగళవారం, శుక్రవారం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ముత్తైదువులు, పెండ్లికాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైనది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తోర శతనామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖసంపదలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పెండ్లి కాని వారికి వివాహం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, పంచమిని (జూలై 25) జరుపుకొంటారు. ఈ రెండు రోజులతో పాటు, శ్రావణ శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఇక ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం (జూలై 31) నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరల లక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ (ఆగస్టు 3) శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు.
ఇక శ్రీ కృష్ణాష్టమి (ఆగస్టు 11) శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్టుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.