Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీ ఫార్ములాలో రాజస్థాన్ రాజకీయం : సచిన్ ఘర్ వాపసీ!!!

Advertiesment
రాజీ ఫార్ములాలో రాజస్థాన్ రాజకీయం : సచిన్ ఘర్ వాపసీ!!!
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:18 IST)
కొన్ని రోజుల క్రితం ఆసక్తి రేకెత్తించిన రాజస్థాన్ రాజకీయం ఇపుడు టీ కప్పులో తుఫానులా సమసిపోయేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రెబెల్ నేత సచిన్ పైలట్ చివరకు రాజీ ఫార్ములాకు సమ్మతించి, తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తన మద్దతుదారులైన 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. కొన్ని రోజుల తర్వాత ఆయన శాంతించి ఇపుడు రాజీ మార్గానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, సోమవారం పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం.. పైలట్‌ కాంగ్రెస్‌తోనే కొనసాగుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. 
 
ఢిల్లీలోని రాహుల్‌ నివాసంలో జరిగిన సమావేశంలో పైలట్‌ పలు సమస్యలను వారి ముందు ఉంచారని, వాటిపై కూలంకషంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయించినట్లు వెల్లడించారు. 
 
ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, గెహ్లోత్‌ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సిన సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలోని ఈ పరిణామంతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం ముగిసినట్లేనని భావిస్తున్నారు. అయితే పైలట్‌ గతంలో నిర్వహించిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులను తిరిగి చేపట్టే అవకాశాలు లేవని, ఆయనకు రాజస్థాన్‌ వెలుపల పార్టీ పదవి అప్పగించవచ్చని తెలుస్తోంది.
 
అయితే, సచిన్‌ పైలట్‌ రాజీ పడడానికి కారణం.. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సింధియా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైలట్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆమె ఆసక్తి చూపకపోవడంతో ఆయన వెనకడుగు వేయక తప్పలేదని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి మిలియన్ మందికి 47,459 మందికి పరీక్షలు చేశాము: ప్రధానితో సీఎం జగన్