తప్పు చేస్తే శిక్ష విధించాల్సిన పోలీసులే అక్రమానికి పాల్పడితే ఏం చేయాలి? కరోనా లాక్‌డౌన్‌ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు బలవంతంగా గుంజారు. సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
ఇలా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన విషయం డీజీపీ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరపగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కేసు నమోదైంది. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ మేరకు డీజీపీకి నివేదిక అందజేశారు. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికార వర్గాలు యోచిస్తున్నాయి.