ఇండియా లాక్‌డౌన్-4 ఎలా ఉండబోతోంది? బస్సులు నడుస్తాయా?

గురువారం, 14 మే 2020 (15:46 IST)
ఈనెల 12వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఆయన ఇలా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది ఆరోసారి.

 
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. లాక్‌డౌన్ మొదటి దశలో అవసరమైన చర్యలు రెండో దశలో అవసరం ఉండవని, అలాగే మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశకు అవసరం ఉండవని మోదీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో దేశంలో లాక్‌డౌన్-4 కూడా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. అయితే, అది లాక్‌డౌన్-3లా మాత్రం ఉండబోదన్నది నిశ్చయమైంది. మరి లాక్‌డౌన్-4 ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం చాలా వరకూ ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం నుంచే లభిస్తోంది.

 
రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇస్తారా?
భారత్‌లో ఇంతవరకూ అమలైన లాక్‌డౌన్ దశల్లో కేంద్ర ప్రభుత్వం అధికారం చెలాయించడమే కనిపించింది. కేంద్ర హోం, ఆరోగ్య శాఖలు ఆదేశాలు ఇచ్చాయి. రాష్ట్రాలు అమలు చేస్తూ వచ్చాయి. కానీ, సోమవారం జరిగిన సమావేశంలో తమదైన విధానాలను అమలు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించడం, లాక్‌డౌన్ పొడగించడం, కార్మికుల రాకపోకల విషయంలో రాష్రాలకు నిర్ణయం వదిలేయాలని కోరారు.

 
రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించుకోనివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. రైలు సేవలను ప్రారంభించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానిని కోరారు. లాక్‌డౌన్‌ను ఇంకా పొడగించాలని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కోరారు.

 
రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ఇదివరకు కూడా ఆమె చాలా సార్లు ఈ ఆరోపణ చేశారు. తదుపరి నిర్ణయాల్లో తమ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలు కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది. లాక్‌డౌన్-4లో చాలా వరకూ ఇలాంటి వెసులుబాటులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కేంద్రం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

 
మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తారా?
మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని పారిశ్రామిక సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని మోదీ చెప్పారు.

 
యాభై రోజులుగా చాలా సంస్థలు మూతపడి ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా వాటి దగ్గర డబ్బులు లేవని సీఐఐ అంటోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోకుంటే, తిరిగి అవి నిలదొక్కుకునే అవకాశం లేదని చెబుతోంది. దీంతో ఎంఎస్ఎంఈ పరిశ్రమల కోసం బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీలో భాగంగా పలు రాయితీలు, వెసులుబాట్లు ప్రకటించారు.

 
రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. లాక్‌డౌన్-3లో చాలా రాష్ట్రాలు ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరవడానికి, ఈ-డెలివరీ చేయడానికి కారణం ఇదే. రాష్ట్రాలు తమ ఖజానాలు నింపుకునేందుకు మరిన్ని ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది.

 
దుకాణాలు, మార్కెట్లు తెరుచుకుంటాయా?
గడిచిన 50 రోజుల్లో ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్ల జీఎస్‌టీ కోల్పోయిందని రిటైల్ వ్యాపారుల సంఘం కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. మార్కెట్లను తెరవాలని తాము చేసిన సూచనలను లాక్‌డౌన్-4లో ప్రభుత్వం ఆలకిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

 
‘‘ఆరంభంలో వారంలో రెండు లేదా మూడు రోజులు మార్కెట్లను తెరవాలి. రోడ్డుకు ఒకవైపు ఉన్న దుకాణాలు ఒక రోజు, ఇంకొకవైపు ఉన్న దుకాణాలు మరో రోజు తెరిచే వెసులుబాటు కూడా ఇవ్వచ్చు. మార్కెట్లను వేర్వేరు సమయాల్లోనూ తెరవచ్చు. భౌతిక దూరం, ప్రభుత్వం విధించే ఇతర నిబంధనలను పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించేందుకు రిటైల్ వ్యాపారులందరూ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి స్పష్టం చేశాం’’ అని అన్నారు. ఈ సూచనల్లో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించవచ్చు. ఎందుకంటే అది ఇటు వ్యాపారులకూ, అటు ప్రభుత్వానికీ ప్రయోజనకరమే.

 
ప్రజా రవాణా వ్యవస్థలు నడుస్తాయా?
లాక్‌డౌన్-4 విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని దిల్లీ వాసులను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. బస్సులు, మెట్రో, ఆటో, టాక్సీ వంటి సేవలన్నీ ప్రారంభించాలా? వద్దా? అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగారు. మే 12న పరిమిత సంఖ్యలో దిల్లీ నుంచి రైలు సేవలు మొదలయ్యాయి. స్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారి వాహనాలను అనుమతిస్తున్నారు.

 
చాలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు లాక్‌డౌన్-3లోనే తెరుచుకున్నాయి. లాక్‌డౌన్-4లో మార్కెట్లు, కొన్ని కార్యాలయాలు తెరుచుకుంటే, రాకపోకలకు వీలుగా ప్రజారవాణా సేవలను ప్రారంభించడం తప్పనిసరి అవుతుంది. అందరికీ సొంత వాహనాలు ఉండవు కాబట్టి భౌతిక దూరం పాటిస్తూనే, నిర్ణీత సమయాల్లో ప్రజా రవాణా సేవలు నడిచేందుకు అనుమతించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

 
అత్యవసర సేవల్లో పాలుపంచుకుంటున్నవారి రాకపోకల కోసం ముంబయి లోకల్ ట్రెయిన్లను నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వశాఖను కోరింది. మరోవైపు లాక్‌డౌన్-4లో దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభించవచ్చని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పూరీ ఇదివరకే సంకేతాలిచ్చారు. ఇక ప్రధాన మంత్రితో సమావేశంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలను అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. కొన్ని నిబంధనలతో దిల్లీ మెట్రో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
ఆసుపత్రుల సంగతేంటి...
కరోనావైరస్ సంక్షోభంతో మిగతా వ్యాధులు, సమస్యల నుంచి అందరి దృష్టి మళ్లింది. మలేరియా, చికన్‌గునియా, థలసేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, డయాలసిస్ వంటివి చేయించుకోవాల్సిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే చాలా ఆసుపత్రుల్లో అత్యవసర సేవలతోపాటు ఓపీడీ సేవలు కూడా ప్రారంభమవుతున్నాయి.

 
కరోనావైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేవరకూ. ఆ వ్యాధితో కలిసి జీవించడానికి అలవాటు పడాల్సిందేనని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ‘‘లాక్‌డౌన్-4లో నెమ్మదిగా మరిన్ని కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. అవసరమైన సేవలను 40-50 రోజులకు మించి ఆపడం కుదరదు. దేని గురించైనా బయటకు వెళ్తున్నప్పుడు... అది లేకుంటే పని జరగదా? అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే కరోనావైరస్ సోకకుండా చూసుకోగలం’’ అని అన్నారు.

 
స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు మూసే ఉంటాయా?
లాక్‌డౌన్-4లో మూసి ఉంచగలిగే సేవల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు కూడా ఉంటాయి. వెంటనే ఇవి తెరవకపోయినా, పెద్దగా సమస్యలు ఉండవు. విద్యా సంస్థల్ని పక్కనపెడితే మిగతావి అవసరాలు కాదు, విలాసాల కిందకు వస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జీవితాలే సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి మరిన్ని రోజులు వీటిని మూసి ఉంచినా నష్టమేమీ ఉండదని చెబుతున్నారు.

 
అయితే, ఎక్కడ మినహాయింపులు ఇచ్చినా... ప్రజలు నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే ఉంది. భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు తరచూ కడుక్కోవాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రజలు ఒక ఈ-పాస్‌లా వినియోగించుకునేలా చేసే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రభుత్వం ఇదివరకు చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈపీఎఫ్‌వో చందా పరిమితి తగ్గింపు... ఉద్యోగి చేతికి అదనపు వేతనం