Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈపీఎఫ్‌వో చందా పరిమితి తగ్గింపు... ఉద్యోగి చేతికి అదనపు వేతనం

ఈపీఎఫ్‌వో చందా పరిమితి తగ్గింపు... ఉద్యోగి చేతికి అదనపు వేతనం
, గురువారం, 14 మే 2020 (15:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం లోగుట్టును కేంద్రం విత్తమంత్రి నిర్మలా సీతారమన్ బుధవారం దేశ ప్రజలకు వివరించారు. మొత్తం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎవరికి ఎంతెంత ఇస్తారన్న విషయాన్ని ఆమె 15 రోజుల పాటు 15 అంశాలపై మాట్లాడనున్నారు. తొలి రోజున ప్రకటించిన విషయాల్లో ఈపీఎఫ్‌వో అంశం ఉంది. 
 
ఈ అంశంలో భాగంగా, ఈపీఎఫ్‌ చందా పరిమితి 12 నుంచి 10 శాతానికి తగ్గించడంతో మూడునెలల పాటు ఈపీఎఫ్‌వో చందాదారుల భవిష్యనిధి నిల్వలో జమ తగ్గనుంది. ఉద్యోగి జమ చేసే నెలవారీ చందాను తగ్గించడంతో ఆ మిగిలిన మొత్తంతో ఉద్యోగి చేతికి అదనపు వేతనం వస్తుందని కేంద్రం వెల్లడించింది. 
 
 
గరీబ్‌ కళ్యాణ్‌ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 24 శాతం వాటా(ఉద్యోగి, యజమాని) లబ్ధి పొందని ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈపీఎఫ్‌ చట్టం ప్రకారం ఉద్యోగి వేతనం(మూలవేతనం, కరవుభత్యం) నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ చందా చెల్లించాలి. అంతే మొత్తంలో యజమాని తన వంతు వాటా చెల్లిస్తారు. లాక్డౌన్‌ నేపథ్యంలో ఈ చందాను 10 శాతం చేయడంతో... ఉద్యోగి వేతనంలో ప్రతినెలా 2 శాతం మిగులుతుంది. ఈ 2 శాతం ఉద్యోగికి అదనపు వేతనంగా మారనుంది. 
 
ఉదాహరణకు ఉద్యోగి మూలవేతనం రూ.25 వేలు ఉంటే... 12 శాతం లెక్కన రూ.3 వేలు చందా రూపంలో పీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తాయి. తాజాగా 10 శాతానికి తగ్గించడంతో వాటా రూ.2500 అవుతుంది. మిగతా రూ.500 ఉద్యోగి చేతికి అదనపు వేతనంగా లభిస్తుంది. యజమాని వాటా కింద మిగిలే రూ.500 ప్రయోజనం లభించదు. 
 
పరోక్షంగా భవిష్యనిధిలో యజమాని, ఉద్యోగి వాటా మూడునెలల పాటు ప్రతినెలా రూ.1000 వరకు జమ తగ్గనుంది. ఈపీఎఫ్‌ చందాను 10 శాతానికి తగ్గించాలని గతంలోనే కేంద్ర కార్మికశాఖ పలు ప్రతిపాదనలు పరిశీలించిన నేపథ్యంలో తాజా తగ్గింపు చందా నిబంధన స్వల్ప కాలానికే ఉంటుందా? లేదా చట్టసవరణ ద్వారా శాశ్వతంగా చేయనుందా? అనేది తెలియాల్సి ఉంది. 
 
ప్యాకేజీలో భాగంగా యజమాని వాటాను 10 శాతంగా నిర్ణయించినా.. పింఛను పథకం కింద చెల్లించే చందాలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు యజమాని వాటా కింద 12 శాతం జమ చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిందే : హైకోర్టు