Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యవసాయం ప్రధానంగా మరిన్ని పరిశోధనలు జరగాలి: ఉపరాష్ట్రపతి

వ్యవసాయం ప్రధానంగా మరిన్ని పరిశోధనలు జరగాలి: ఉపరాష్ట్రపతి
, మంగళవారం, 28 జనవరి 2020 (07:39 IST)
మనకు తిండిపెడుతున్న రైతు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతం చేసినపుడే శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు సార్థకరత చేకూరుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఎక్కువ ఉత్పత్తి, తక్కువ కాల వ్యవధి ఉండే వంగడాలను సృష్టించి క్రిమికీటకాలను తట్టుకునేలా అన్నదాతకు భరోసా కల్గించే పరిశోధనలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని సీసీఎంబీని సందర్శించిన ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులనుద్దేశించి మాట్లాడారు.

‘భారతదేశంలో ప్రస్తుతానికి ఆహార భద్రత తగినంత ఉంది. కానీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ఆహార అవసరాలు తీర్చేలా కొత్త వంగడాలను కనుక్కోవాలి. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు హర్షనీయమే.

మరింత విస్తృతంగా ప్రయత్నాలు జరగాలి. కానీ వాతావరణ సమస్యలు, అకాల వర్షాలు, వరదలు, పంట ఉత్పత్తి తగ్గిపోవడం, క్రిమికీటకాల సమస్యలు వంటి సవాళ్లు అన్నదాతను ఇబ్బంది పెడుతున్నాయి. అన్ని రకాలుగా రైతన్నను ఆదుకునే లక్ష్యంతో పరిశోధనలు జరగాలి. అప్పుడే ఆహార భద్రతకు ఢోకా ఉండదు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 
 
వివిధ రకాల కొత్తరకాల ప్రమాదరక వైరస్ లు విజృంభిస్తున్న తరుణంలో.. వీటి ద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సంపూర్ణ సహకారంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

యాంటీబయోటిక్స్ పనిచేయని పరిస్థితులు తలెత్తుతున్న ఈ సందర్భంలో.. మొండిగా మారిన పలు వైరస్ ల ప్రభావాన్ని తట్టుకునేలా పరిశోధనలపై దృష్టిపెట్టాలన్నారు. ‘చైనాలో కరోనావైరస్ కారణంగా జరుగుతున్న ప్రమాదాన్ని చూస్తూనే ఉన్నాం.

ఇది మిగిలిన దేశాలకు కూడా వ్యాప్తిచేందుతోందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాన్ని ముందే గుర్తించి దానికి విరుగుడు కనుగొనడంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేయాలి. ఈ ప్రమాదం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన అంశం కాదు.

సమస్త మానవాళిని ప్రమాదంలోని నెట్టే అంశంపై లోతుగా ఆలోచించాలి. ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ విషయంలో ఇప్పటికే సీసీఎంబీ కేంద్రంగా చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. మరింత విస్తృతమైన పరిశోధనలు జరగాలి’ అని అన్నారు. భారతదేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో సృజనాత్మకమైన శాస్త్రసాంకేతిక పరిశోధనలు కీలకమనే విషయాన్ని మరవొద్దన్నారు.

ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోపాటు ప్రైవేటు రంగం కూడా ప్రత్యేక చొరవతీసుకోవాలని, పరిశోధనలకు అవసరమైన నిధులను అందించడం, పరిశోధలను ప్రోత్సహించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు.

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మానవజీవితాన్ని సుఖవంతం చేసేందుకు శాస్త్ర, సాంకేతిక పరిశోధలను ఎంతగానో ఉపయోగపడతాయని అందుకు ప్రోత్సాహం అందించాలన్నారు.

సీసీఎంబీ ప్రయోగశాలలు ఈ దిశగా చొరవతీసుకుని పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, కాలుష్యం, అపరిశుభ్రమైన నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు, పట్టణీకరణ పెరుగుతున్న కారణంగా వస్తున్న ఇబ్బందుల పరిష్కారానికి వేదికలు కావాలని సూచించారు. 

 
తాజా వైద్య నివేదికల ప్రకారం భారతదేశంలో 7కోట్ల మంది జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నారని దీనిపైనా దృష్టిపెట్టాలని సూచించారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు చొరవతీసుకోవాలని.. సమీపంలోని బస్తీలు, గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు జీవన విధానంలో అవసరమైన మార్పులు, జన్యుపరమైన సమస్యలను ప్రారంభంలోని గుర్తించి అవసరమైన చికిత్సను సూచించడంలో చొరవతీసుకోవాలన్నారు.

ఈ దిశగా యువశాస్త్రవేత్తలు మరింతగా పనిచేయాలని సూచించారు. సీసీఎంబీ సందర్శన సందర్భంగా పలు పరిశోధన కేంద్రాల గురించి అడిగితెలుసుకున్నారు. వ్యాధులు, కొత్త వంగడాల తయారీ తదితర పరిశోధనల గురించి యువశాస్త్రవేత్తలు ఉపరాష్ట్రపతికి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాతోపాటు సీఎస్ఐఆర్ పలు ప్రయోగశాలల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, యువ పరిశోధకులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రియాశీలకంగా పని చేసేవారికి బాధ్యతలు: పవన్