Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేక పోరును ముమ్మరం చేయాలి... ఉపరాష్ట్రపతి పిలుపు

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేక పోరును ముమ్మరం చేయాలి... ఉపరాష్ట్రపతి పిలుపు
, సోమవారం, 29 జులై 2019 (06:33 IST)
మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని రాజీ లేకుండా ముందుకు తీసుకుపోవాలని, ఇందు కోసం ప్రభుత్వ సంస్థలతో పాటు పౌరసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఈ సామాజిక జాడ్యం బారిన పడ్డ చివరి వ్యక్తిని రక్షించే వరకూ, వారికి న్యాయం జరిగే వరకూ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరును కొనసాగించాలని సూచించారు. 
 
డా. సునీతా కృష్ణన్ నిర్వహణలో, మానవ అక్రమ రవాణా నుంచి బయట పడిన వారికి ఆశ్రయం కల్పిస్తున్న హైదరాబాద్ లోని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజ్వల్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, మానవ అక్రమ రవాణా నుంచి బయట పడిన వారికి ఆశ్రయం కల్పించే  ఆశ్రమ నిర్వహణ శిక్షణా మాన్యువల్ ను విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా ఈ మాన్యువల్ ను అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఇదే వేదిక నుంచి ఒక నెల జీతాన్ని ప్రజ్వల్ సంస్థకు విరాళంగా ప్రకటించారు. మానవ అక్రమ రవాణా కేవలం ఒక సామాజిక జాడ్యం మాత్రమే కాదని, ఇది మానవాళికి వ్యతిరేకంగా సాగే హింసాత్మక నేరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మానవ హక్కులు, న్యాయం, గౌరవం లాంటి అన్ని ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించే జాడ్యమని, దీన్ని ఆధునిక బానిసత్వంగా భావించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

ప్రతి వ్యక్తికి గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంటుందని, స్వేచ్ఛను అందించి, శ్రమదోపిడీని నిరోధించే విధంగా రాజ్యాంగం చక్కని పునాదులు వేసిందని, బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా లాంటివి ఈ హక్కును కాల రాసేవని, వీటికి వ్యతిరేకంగా పోరాడే పవిత్ర కర్తవ్యాన్ని రాజ్యాంగం ప్రతి పౌరుడి మీద ఉంచిందని సూచించారు. ఇలాంటి సమస్యల విషయంలో సమాజం సంఘటితం కావాలని, మానవ అక్రమ రవాణా స్వభావం, ఈ జాడ్యం నుంచి ప్రాణాలతో బయపడిన వారిని రక్షించడం, మరియు పునరావసం కల్పించడం లాంటి అంశాల మీద దృష్టి పెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.

మానవ అక్రమ రవాణా నుంచి బయట పడిన వారికి గౌరవ ప్రదమైన సాధారణ జీవితాన్ని గడిపేందుకు సహకారం మరియు మద్దతు అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి.. అక్రమ రవాణా హింస, దుర్వినియోగం, దోపిడీ నుంచి  బయటపడిన వారి శారీరక, మానసిక, భావోద్వేగాలతో పాటు ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ రక్కసి నుంచి బయట పడిన వారిని సహాయక వాతావరణాన్ని మరియు వ్యవస్థను సృష్టించడం, వారికి విద్య, శిక్షణ, ఉపాధి మార్గాలను అందించే ప్రయత్నం చేయడం అత్యంత కీలకమని తెలిపారు.

ముఖ్యంగా పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని, బాలల మనసుల మీద ఇలాంటి సమస్యలు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకు వారికి అధిక సంరక్షణ అవసరమని, మానవ అక్రమ రవాణా ప్రతికూల ప్రభావం నుంచి పిల్లలు బయట పడేలా వారి సంరక్షణ ఉండాలని పేర్కొన్నారు. 
 
మానవ అక్రమ రవాణా నుంచి బయట పడిన వారి సంరక్షణ కోసం ఉద్దేశించిన సేఫ్ హోమ్స్ సంపూర్ణ పునరావసం కల్పించే వాతవరణాన్ని సృష్టించే విషయంలో తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ సమస్య నుంచి బయట పడిన వారు వీలైనంత త్వరగా కోలుకునేందుకు వారికి ప్రశాంతమైన పునరావాసం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దేబశ్రీ చౌదరి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంటువ్యాధులను నిరోధించేందుకు కృషి చేయాలి...వెల్లూరు ప్రొఫెసర్ జార్జ్ ఎం వర్గీస్