Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రపతిపై కేరళ ప్రభుత్వం దావా... అసాధారణ చర్యగా కామెంట్స్

Advertiesment
Pinarayi Vijayan

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (12:19 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ పౌరురాలు (రాష్ట్రపతి)పై దావా వేసింది. ఈ నిర్ణయాన్ని అసాధారణ చర్యగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ఏడు బిల్లులను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. వాటిని పరిశీలన పేరుతో గవర్నర్ .. రాష్ట్రపతికి పంపించారు. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం దావా వేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం మండిపడింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవరిస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం ఆరోపించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్, రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని కోరింది.
 
యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు- 2022, యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు (నంబర్-2)-2022, యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు (నంబర్-3)-2022, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు-2022తో పాటు మరో మూడు బిల్లులు కలిపి మొత్తం 7 ఆమోదించి అసెంబ్లీ వాటిని గవర్నర్‌కు పంపింది. గవర్నర్ వాటిపై సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. దీనిని కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. 
 
ఆమోదించకపోవడానికి ఎలాంటి కారణం లేకుండానే రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తన రిటిపిటిషన్‌లో కోరింది. పిటిషన్‍‌లో గవర్నరు, గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది.
 
కాగా, 11 నుంచి 24 నెలల క్రితం కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లులపై సంతకాలు చేయకుండా ఆపాలంటూ రాష్ట్రపతికి కేంద్రం సూచించడాన్ని కూడా కేరళ ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ బిల్లులన్నీ రాష్ట్రపరిధికి సంబంధించినవని, వీటిని ఆపడం అంటే సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించడం, ఆటంకపరచడం కిందికి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసిస్‌లో చేరేందుకు వెళుతున్న ఐఐటీ-గౌహతి విద్యార్థి అరెస్టు