కరోనా లాక్‌డౌన్ 5.0లో భాగంగా ఆంక్షలను సడలిస్తుండడంతో జూన్ 14 నుంచి జూన్ 28వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుందని దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. మలయాళీల మాసమైన మిథునం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని, దీంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అందుకుగాను ఆలయాన్ని తెరుస్తామని వివరించారు.
ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కోవిడ్ జాగ్రత్త రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో తమ వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలని, వారికే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
ఇక భక్తులు తమకు ఎలాంటి వ్యాధులు లేవని నిర్దారిస్తూ ల్యాబ్‌ల నుంచి తెచ్చుకున్న ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని, ఆ ల్యాబ్‌లు ఐసీఎంఆర్ గుర్తింపు కలిగి ఉండాలన్నారు. అన్ని వివరాలను పరిశీలించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని అన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లను వాడాలని సూచించారు.
కేరళలోని ప్రఖ్యాత గురువాయూరు ఆలయంలో పెళ్లిళ్లు అనుమతించనున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ సడలింపులు నేపథ్యంలో గురువాయూరు ఆలయంలో మళ్లీ సాంప్రదాయ పెళ్ళిళ్లు ప్రారంభం కానున్నాయి. గురువాయూరు ఆలయాన్ని సందర్శించాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని అధికార వర్గాల సమాచారం. రోజులో 600 మందిని పూజలకు అనుమతిస్తారు.
అలాగే, ఆలయ ప్రాంగణంలో రోజుకు 60 పెళ్లిళ్లను మాత్రమే అనుమతించనున్నారు. ఒక్కో వివాహ బృందంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో కలిపి 10 మందిని మాత్రమే అనుమతిస్తారు.