చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కాళీచరణ్ మహరాజ్ నోటిదూలను ప్రదర్శించి జైలుపాలయ్యాడు. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు. అలాగే, ఇస్లాం మతాన్ని కించపిరిచేలా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో చత్తీస్‌గఢ్ పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల రాయ్‌పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. గాంధీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశారనీ, అందుకే ఆయన్ను చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.
ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కాళీచరణ్ మహారాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో అరెస్టు చేసి రాయపూర్‌కు తరలించారు.