కరోనా వైరస్ బారినపడిన ఓ బాలికకు చికిత్స చేయిస్తామని నమ్మించి వ్యభిచారం చేయించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలికతో నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిస్తూ ఓ ముఠా వ్యభిచారం చేయించింది. అయితే, ఈ ముఠా నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మరో ముఠాకు చిక్కింది. ఈ ముఠా వేరొకరికి రూ.40 వేలకు విక్రయించింది. ఈ కేసులో ఇప్పటివరకు 21మందిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన 13 యేళ్ళ బాలిక ఈ యేడాది జూన్ 26వ తేదీన కరోనా వైరస్ బారినపడింది. ఆ తర్వాత ఆమె తల్లికి కూడా ఈ వైరస్సోకింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ కన్నుమూసింది. ఈ క్రమంలో బాలిక తండ్రికి పరిచయమైన గుంటూరు ద్వారకా నగర్‌కు చెందిన స్వర్ణకుమారి బాలికకు నాటు మందు ఇప్పిస్తామని బాలిక తండ్రికి చెప్పింది. దీంతో తన కుమార్తెను ఆమె మహిళతో పంపించాడు.
ఆ తర్వాత ఆ బాలికను స్థానిక చైతన్యపురిలో ఆమెను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయింయడం మొదలుపెట్టింది. కుమార్తె కోసం తండ్రి ఫోన్ చేసిన ప్రతిసారి చికిత్స పొందుతోందని చెపుతూ వచ్చింది. ఆ తర్వాత ఆ బాలికను స్వర్ణకుమారి హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు తిప్పుతూ వ్యభిచారం చేయించింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న బాలిక తప్పిపోయిందంటూ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, నెల్లూరు నుంచి తప్పించుకున్న బాలిక ఇటీవల విజయవాడ బస్టాండుకు చేరింది. అక్కడ ఆమెకు పరిచయమైన మరో వ్యభిచార ముఠా నిర్వాహకురాలు నాగలక్ష్మి... ఇంటికి తీసుకెళ్తానని బాలికను నమ్మించి తణుకుకు తీసుకెళ్లి, అక్కడ శారద అనే మహిళ వద్దకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. అక్కడ నుంచి అశ్విని అనే మహళ వద్దకు పంపించింది. ఈమె విజయవాడకు చెందిన మాజీ హోంగార్డు జెసింత, ఆమె కుమార్తె హేమలతలకు రూ.40 వేలకు బాలికను విక్రయించింది. వీరిద్దరూ కలిసి ఆ బాలికతో వ్యభిచారం చేయించసాగారు.
ఈ క్రమంలో ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాగా చదివిస్తామని బాలికను నమ్మించి జెసింత, హేమలతలు సత్తెనపల్లిలో బాధితురాలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి టీసీ ఇవ్వాలని కోరారు. అయితే, తండ్రి వస్తేగానీ టీసీ ఇవ్వమని స్కూల్ సిబ్బంది చెప్పడంతో ఓ కారు డ్రైవరును ఆమె తండ్రిగా చెప్పి టీసీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బాలికను శాశ్వతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు.
ఈ క్రమంలో ఓ రోజున వారి నుంచి తప్పించుకున్న బాలిక... తండ్రి వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో ఆయన మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ బృందాలు గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన నిందితులతో పాటు హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన 21మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు సినీ నిర్మాత కూడా ఉండటం గమనార్హం. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.