తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాగ్యనగరిలోని జూబ్లీ హిల్స్‌లోని ఆయన ఇంటి వద్దే అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎర్రవల్లికి చేరుకోవాల్సివుంది.
కానీ, ఉదయాన్ని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేవంత్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు.