దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చిన్నారులు సహా ఐదుగురు చిక్కుకున్నారు. ఇప్పటికే శిథిలాల కింద నుంచి ఇద్దరు మహిళలను సురక్షితంగా వెలికితీశారు. ఉత్తర ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూలిన భవనంలో దాదాపు 300 నుంచి 400 వరకు ప్లాట్లు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అధికారులు వివరాల ప్రకారం.. శిథిలాల నుంచి ఇద్దరు మహిళలను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కూలిన ఇంటి శిథిలాల కింద తొమ్మిదేళ్ల బాలికతో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు.