స్నేహితులు అంటే ప్రాణాలను సైతం ఇస్తారు. కానీ ఈ స్నేహితులు కొత్తగా పెళ్లి చేసుకున్న తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేసారు. పెళ్లయిన గంటకే వరుడు హత్యకు గురవడంతో ఇంటిల్లపాదీ శోకంలో మునిగిపోయారు.
పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ లోని పాలీముకీంపూర్ ప్రాంతానికి చెందిన బబ్లూ అనే యువకుడికి సోమవారం వివాహం జరిగింది. తన పెళ్లికి స్నేహితులందరనీ పిలిచి మటన్ బిర్యానీతో పాటు పూటుగా మద్యం పోయించాడు. కానీ వారిలో కొంతమంది తమకు మద్యం చాల్లేదనీ, ఇంకా కావాలంటూ మొండికేసారు.
అప్పటికే తూలుతూ మత్తులో జోగుతున్న స్నేహితులను చూసి... ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరనీ, తర్వాత పార్టీ ఇస్తానని చెప్పాడు వరుడు. ఆ మాటలకు ఓ ఫ్రెండ్ తీవ్ర ఆగ్రహం చెంది తన వద్ద వున్న కత్తితో పొడిచేశాడు. ఆ తర్వాత అంతా అక్కడి నుంచి పరారయ్యారు. వరుడు రక్తపు మడుగులో పడి వుండటాన్ని గమనించిన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృత్యువాత పడ్డాడు.