నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ ఓ వ్యక్తి నిద్రలేవగానే ఇంటి పైకప్పుపై రెండు సంచుల్ని గుర్తించాడు. అందులో పెద్దమొత్తంలో నగదు వుండటంతో షాకయ్యాడు. అంతేగాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూపీ మేరఠ్‌లో నివాసం ఉండే పవన్ సింఘాల్ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు.
దాదాపు రూ. 40 లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిన రాజు, సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.