క్షణికావేశం నేరాలకు దారితీస్తుంది. ఆవేశాన్ని నియంత్రించుకోలేక నేరాలకు పాల్పడుతున్నారు. భార్యాభర్తల గొడవలతో ప్రస్తుతం నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భర్తమీద కోపంతో ఓ తల్లి తన 14 రోజుల వయసున్న పసిబిడ్డను భవనంపై నుంచి కిందకు పడేసింది. ఈ ఘటన సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్, ఫతేనగర్‌కు చెందిన లావణ్యలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండోసారి గర్భందాల్చిన లావణ్య ఫతేనగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.
భర్తతో గొడవల నేపథ్యంలో గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు బాధితురాలిని సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సిజేరియన్ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి లావణ్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం తను నివాసం ఉంటున్న మూడో అంతస్తు పైనుంచి తన 14రోజుల పసికందును కిందకు పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లావణ్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.