ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంతో సహా ఏకంగా 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అబ్కారీ విధానాన్ని వెనక్కి తీసుకుంది. దీని వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇందులో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో సహా మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులపై అభియోగాలు నమోదు చేసింది. పైగా, మనీశ్ సిసోడియాను న్యూయార్క్ టైమ్స్ ప్రశంసిచిన రోజునే ఆయన నివాసంతో పాటు 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేయడం గమనార్హం.
అంతకుముందు అబ్కారీ విధానంలో అవకతవకలు జరిగినట్టు నివేదిక రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. "మేక్ ఇన్ ఇండియా" పేరిట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యాప్త ప్రచార కార్యక్రమం ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం.