కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని క్రమంగా ఉద్యోగాలపైన కూడా చూపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కొన్ని కంపెనీలు భారీ నష్టాలతో విలవిలలాడిపోతున్నాయి. తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి.
తాజాగా గుర్‌గ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా ఆధారిత కంపెనీ కనీసం 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. గుర్ గ్రామ్ కేంద్రానికి అనుబంధంగా పనిచేస్తున్న మరో కంపెనీ పుణెలో వుంది. ఇక్కడ కూడా కొందరు ఉద్యోగులను తొలగించినట్లు చెపుతున్నారు.
ఎలాంటి కారణంగా చెప్పకుండానే సదరు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా... కాంట్రాక్టు పత్రంలో మీరు అంగీకరించినట్లుగానే కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం అంటూ క్లుప్తంగా సందేశాలను పంపినట్లు సదరు కంపెనీలు పని చేస్తున్న ఉద్యోగులు చెపుతున్నారు.
ఇలా ఉద్యోగాలు పోయినవారిలో 10 సంవత్సరాల అనుభవం వున్నవారు కూడా వుండటం గమనార్హం. కాగా దీనిపై కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్పందన కోరితే ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలిసింది. మరి ఈ లాక్ డౌన్ మరికొన్నాళ్లు కొనసాగితే ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు పడుతుందో ఏమో?