పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.
ఈ కాల్పుల ఘటనను బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, కేంద్ర బలగాలు ఉద్దేశపూర్వకంగానే నలుగురు అమాయకులను కాల్చిచంపాయని ఆమె ఆరోపించారు. వాళ్లకు చంపే ఉద్దేశం లేకుండా కాళ్లపైననో లేదంటే శరీరాల కిందవైపునో కాల్చేవాళ్లని.. చంపాలనుకున్నారు కాబట్టే మెడపైన, ఛాతిపైన కాల్చారని గురిపెట్టి కాల్చారని మండిపడ్డారు.
దేశంలో అసమర్థ ప్రధాని, అసమర్థ హోంమంత్రి నేతృత్వంలో ఒక అసమర్థ ప్రభుత్వం నడుస్తున్నదని మమతా బెనర్జి విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెంగాల్‌ను దక్కించుకోవడానికి రోజూ వస్తున్నారని, వాళ్లు వచ్చిపోవడం తప్పుకాదు కానీ, రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బలగాల చేత ప్రజలను చంపించి ఆ తర్వాత వాళ్లకు క్లీన్ చిట్ ఇస్తారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు వీడియో కాల్స్ చేసి మమత మాట్లాడారు. వారు ఆవేదనను తన ముందున్న మీడియా ప్రతినిధులకు వినిపించారు. తాను ఈ నెల 14న వస్తానని, ఇంటింటికీ వచ్చి అందరి కుటుంబాలను పరామర్శిస్తానని బాధిత కుటుంబాలకు మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఏమీ చేయలేని అసమర్థులని మమతా బెనర్జీ విమర్శించారు. కాల్పుల ఘటన అనంతరం తనకు శనివారం రాత్రి నిద్ర పట్టలేదని, ప్రధాని మోడీ మాత్రం స్వీట్లు తింటూ గడిపారని ఆమె ఆరోపించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను వెళ్లాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.
అయితే, ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారని, అయినప్పటికీ వెళ్తానని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి)ను ఇప్పుడు మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మార్చారని ఆమె మండిపడ్డారు. కేంద్ర భద్రతా బలగాలు ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నాయని తాను తొలి దశ ఎన్నికల నుంచి చెబుతున్నానని, కానీ తన మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు.