Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం మమతకు ఈసీ నోటీసులు... బలగాలనే అవమానిస్తారా? అంటూ ఆగ్రహం

Advertiesment
సీఎం మమతకు ఈసీ నోటీసులు... బలగాలనే అవమానిస్తారా? అంటూ ఆగ్రహం
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (15:31 IST)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో నోటీసు ఇచ్చింది. పోలింగ్ బూత్‌ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర పారామిలటరీ బలగాల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలగాలను అవమానిస్తారా? అంటూ మండిపడిన ఈసీ..  ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాల్సిందిగా మమతను ఆదేశించింది.
 
మార్చి 28న నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కేంద్ర పారామిలటరీ బలగాలకు అన్ని అధికారాలు ఎవరిచ్చారంటూ మమత ప్రశ్నించారు. మహిళలను ఓటేయకుండా బెదిరించారని, ఆ అధికారం వారికెక్కడిదని ప్రశ్నించారు. 2016, 2019లోనూ ఇలాగే జరిగిందని ఆరోపించారు. 7న హూగ్లీ జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
 
కేంద్ర బలగాలు అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్నాయని, గ్రామస్థులపై అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మహిళలపైనా వేధింపులకు పాల్పడుతున్నారని, బీజేపీకి ఓటేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మండిపడిన ఎన్నికల సంఘం.. రెచ్చగొట్టే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ తాజా నోటీసుల్లో వ్యాఖ్యానించింది. 
 
కేంద్ర బలగాలను తిట్టడం, వారిని అవమానించడం మంచిది కాదని పేర్కొంది. దాని వల్ల బలగాల్లో మనోస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. కాగా, ముస్లింలంతా తృణమూల్ కే ఓటేయాలన్న మమత వ్యాఖ్యలపై అంతకుముందు బుధవారం ఈసీ నోటీసులిచ్చింది. ఇపుడు మరో నోటీసు జారీచేసింది. రెండు రోజుల వ్యవధిలో ఆమెకు అందిన రెండో నోటీసు ఇది. మార్చి 28, ఏప్రిల్ 7న మమత చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ.. వాటిపై రేపు ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
 
భాజపా అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి..
దక్షిణ హౌరా భాజపా అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దాడికి పాల్పడ్డారు. ‘నా వాహనంపై దాడికి పాల్పడిన వ్యక్తులు ఖేలాహోబ్ అంటూ నినాదాలు చేశారు. ఆ పార్టీ ఓటమిని అంగీకరించింది కాబట్టే..ఇలాంటి దాడులకు పాల్పడుతోంది’ అంటూ తృణమూల్‌ను ఉద్దేశించి గుప్తా విమర్శలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ పేరెత్తితే చాలు జగన్ వంట్లో జ్వరం కాస్తోంది... : సునీల్ దేవధర్