పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం శుక్రావరం విడుదలైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ చిత్ర బెనిఫిట్ షోలను ఆఖరు నిమిషంలో ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై పవన్ అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యంగా, జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించింది. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు.
తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లోనూ ఘాటుగా స్పందించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా 'వకీల్ సాబ్'ను చూసి భయపడేది? అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.