అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే నాలుగు రోజుల్లో నగదు చెల్లించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు.
కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదన్న ఆయన.. సకాలంలో బకాయిలు చెల్లించకుంటే కర్షకులు నష్టపోతారని అన్నారు.
ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల్లో ఆలస్యం వద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై దిల్లీలో ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు.
కేంద్రమంత్రులు తోమర్, పాశ్వాన్‌లతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాలను ప్రస్తావించారు.
ధాన్యం కొనుగోలు చేసిన 4 రోజుల్లో నగదు చెల్లించాలని చెప్పారు. ధాన్యం తూకం హెచ్చుతగ్గులపై వచ్చే ఫిర్యాదులను గమనించాలని అన్నారు.
కేంద్ర అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నిధుల విడుదలపై పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.