కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన పనికి ఓ ఏఎస్పీ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించలేనని పేర్కొంటూ స్వచ్ఛంధ విరమణ చేశారు. ఇందుకోసం ఏఎస్పీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏఏస్పీ పేరు ఎన్వీ బరమణి.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనను బహిరంగంగా అవమానించి, చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారనీ, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అందువల్ల తనకు స్వచ్ఛంధ పదవీ విరమణ కల్పించాలని ఎస్పీ (ఏఎస్పీ) ఎన్వీ బరమణి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
గత ఏప్రిల్ 28న బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఓ నిరసన సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్న ఈ సభలో వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఏఎస్పీ బరమణి ఉన్నారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు సభకు అంతరాయం కలిగించడంతో సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
వెంటనే వేదికపై ఉన్న బరమణిని పిలిచి "హేయ్! ఎవరు ఇక్కడ ఎస్పీ? బయటకు వెళ్లు!" అని అందరి ముందూ గట్టిగా అరిచినట్టు బరమణి తెలిపారు. అంతటితో ఆగకుండా, తనను చెంపదెబ్బ కొట్టేందుకు చెయ్యి పైకి లేపారని, తాను వెంటనే వెనక్కి జరగడంతో త్రుటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నానని ఆయన వివరించారు. ఈ ఘటన మీడియాలో ప్రసారమవడంతో తీవ్ర అవమానానికి గురయ్యానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
"శారీరకంగా దాడి జరగకపోయినా, వేలాది మంది ముందు జరిగిన ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఈ ఘటన తర్వాత ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. నా భార్యాపిల్లలు గుండెలవిసేలా ఏడ్చారు. 31 ఏళ్లుగా నిజాయితీగా పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడం దారుణం" అని బరమణి పేర్కొన్నారు. తనకు న్యాయం జరగనప్పుడు, ఇతరులకు తాను ఎలా న్యాయం చేయగలనని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంపై ఏఎస్పీ బరమణి జూన్ 14న హోం సెక్రటరీకి లేఖ సమర్పించారు. ప్రభుత్వం ఆయన రాజీనామాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, సీఎం సిద్దరామయ్యతో పాటు పలువురు మంత్రులు బరమణిని కలిసి, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరినట్టు సమాచారం.