తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో సోమవారం రాత్రి కదులుతున్న ఆటోరిక్షాలో 18 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు.
సేలంలో ఉద్యోగం చేస్తున్న వేరే రాష్ట్రం నుండి వచ్చిన ఆ మహిళ కిలంబాక్కం బస్ టెర్మినస్ వెలుపల బస్సు కోసం వేచి చూస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి ఆటోలో ప్రయాణించాలని కోరాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో, అతను ఆమెను బలవంతంగా ఆటో లోపలికి లాక్కెళ్లాడు. వెంటనే, మరో ఇద్దరు వ్యక్తులు అతనితో పాటు వాహనంలోకి ఎక్కారు. ఈ ఆటో నగర వీధుల్లో వేగంగా వెళుతుండగా కత్తితో బెదిరించి ఆమెపై దాడి చేశారు దుండగులు.
ఆ మహిళ అరుపులు రోడ్డుపై ఉన్నవారిని అప్రమత్తం చేశాయి. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఆటోను పోలీసులు వాహనాన్ని వెంబడించడం ప్రారంభించారు. కానీ వారు దానిని అడ్డుకునేలోపే, దుండగులు ఆ మహిళను రోడ్డు పక్కన పడవేసి పారిపోయారు.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్లని తేలింది. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ముత్తమిళ్ సెల్వన్, మరో వ్యక్తి దయాళన్‌లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
ఇకపోతే.. అన్నా విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల కేసు నమోదైన నెల రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ కేసు తమిళ రాష్ట్రంలో భారీ నిరసనలకు దారితీసింది. ఇప్పటికే మహిళల భద్రతను నిర్ధారించడంలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఆరోపించారు.