Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ప్రపంచ విషాదాల్లో అదొక్కటి

Advertiesment
world
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:22 IST)
ప్రపంచ విషాదాల్లోనే అమెరికాపై దాడి సంఘటన అతి పెద్దదిగా నిలిచిపోయింది. 2001, సెప్టెంబ‌ర్ 11న.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావత్తూ అమెరికా దద్దరిల్లింది. శత్రు దుర్బేధ్యం అంటూ మురిసిపోయే అగ్రరాజ్యం అభిజాత్యంపై భయంకరమైన దెబ్బ పడింది.

అమెరికా పాలకులు, ప్రజలకు వెన్నులో వణుకుపుట్టించేలా ఉగ్రవాదులు పంజా విసిరారు. కనీవినీ ఎరుగని రీతిలో విమానాలతో స్వైర విహారం చేశారు. డబ్ల్యూ టీసీ జంట భవనాలతో పాటు ఏకంగా పెంటగాన్ రక్షణ కార్యాలయంపైనే దాడి చేసి దిగ్భ్రాంతికి గురి చేశారు.

ఆ మారణహోమానికి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. ఉగ్రఘాతుకానికి సాక్ష్యాలుగా నిలిచిన ఫోటోలను డాక్టర్‌ ఎమిలీ చిన్ రిలీజ్ చేశారు. న్యూయార్క్‌లోని మన్‌హటన్ వద్ద విమానాల దాడిలో ట్విన్ టవర్స్ ధ్వంసం అవుతున్న సమయంలో ఎమిలీ చిన్ అక్కడే ఉన్నారు.
 
వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై జ‌రిగిన ఉగ్రదాడులను చ‌రిత్ర మ‌రిచిపోలేదు. బిన్ లాడెన్ ఆధ్వర్యంలో ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ పక్కా వ్యూహంతో జ‌రిపిన దాడుల‌వి. 10 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు వాణిజ్య సేవ‌లందించే 4 ప్యాసింజర్ జెట్ విమానాల‌ను దారి మ‌ళ్లించారు.

హైజాక‌ర్లు 2 విమానాల‌ను వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌కు చెందిన ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని పెంటగాన్‌ రక్షణ కార్యాలయంపైకి వదిలారు. నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న మైదానంలో కుప్పకూలింది.
 
డబ్ల్యూ టీసీ దాడులు ప్రపంచ విషాదాల్లో ఒకటిగా నిలిచిపోయాయి. విమానాల దెబ్బకు ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. పెంటగాన్ రక్షణ కార్యాలయంలోని కొంతభాగం దెబ్బతింది. ఆనాటి మారణహోమంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలతో దాడి చేయడంతో రేగిన మంటలు దాదాపు 3 నెలల పాటు చెలరేగుతూనే ఉన్నాయి.

మంటలను ఆర్పేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంత‌రాయంగా ప‌నిచేశారు. ఈ ఘటన జరిగి 18 ఏళ్లు. డబ్ల్యూ టీసీ దాడులపై అమెరికా ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. సౌదీ అరేబియా, ఇత‌ర అర‌బ్ దేశాల‌ పౌరులే దాడులకు పాల్పడిన‌ట్లు గుర్తించారు.

అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, అల్‌ఖైదా సీనియర్ నాయకులు ఖలీద్ షేక్ మహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచీ, ముస్తఫా అల్ హౌసవీల ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయని కనిపెట్టారు. 2002-2003 మధ్య ఖలీద్ షేక్ మహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచీ, ముస్తఫా అల్ హౌసవీలను అరెస్టు చేశారు.

2011లో లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో గుర్తించి హతమార్చారు. తాజాగా ఐదుగురు ఉగ్ర వాదులపై విచారణకు ముహూర్తం ఖరారైంది. 2021 జనవరి 11 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐదుగురు నిందితులు గ్వాంటనమో బే జైలులో ఉన్నారు. వీరిపై నేరం రుజువైతే మిలటరీ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇక ఆంగ్లంలోనే బోధన