వైభ‌వంగా #WorldPhotographyDay ఉత్స‌వాలు

సోమవారం, 19 ఆగస్టు 2019 (19:52 IST)
తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ త‌ర‌ఫున 181వ వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌ఫీ డే ఉత్స‌వాలు  హైద‌రాబాద్ ఎల్లారెడ్డిగూడ‌ నాగార్జున న‌గ‌ర్‌లోని నాగార్జున న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌లో సోమ‌వారం వైభ‌వంగా జ‌రిగాయి.


తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల అధ్య‌క్షుడు క‌ఠారి శ్రీను, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు. య‌స్‌, ట్రెజ‌ర‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, `అల్ల‌రి` న‌రేష్‌, వైవీయ‌స్ చౌద‌రి, ర‌సూల్ ఎల్లోర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.
 
ఇదే వేదిక మీద‌ సీనియ‌ర్ ఫొటోగ్రాఫ‌ర్లు శ్యామ‌ల్ రావు, శ్యామ్‌ను స‌త్క‌రించారు.  సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులంద‌రూ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. న‌ట కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``మూడు త‌రాల స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల‌తో నాకు అనుబంధం ఉంది. వాళ్లు నాకు ఫ్యామిలీలాంటివాళ్లు. ఒక‌ప్పుడు ఫొటోల‌తోనే నా ప‌బ్లిసిటీ న‌డిచింది. 
 
వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌పీడే సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం, దానికి న‌న్ను ఆహ్వానించ‌డం చాలా ఆనందంగా ఉంది. బి.ఎన్‌.రెడ్డిగారు, ఎన్టీఆర్‌గారు... ఇలా ఎంతో మంది లెజెండ్స్ తో నాకు ప‌రిచ‌యం ఉంది. వారంద‌రితో నాకున్న ఫొటోలు చూసుకుని ఆనాటి విష‌యాల‌ను గుర్తుచేసుకుని ఆనందిస్తుంటాను. ఇప్పుడే కాదు, స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల అసోసియేష‌న్ త‌ర‌ఫున వాళ్లు ఎప్పుడు పిలిచినా, నేను రావ‌డానికి సిద్ధంగా ఉంటాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి`` అని చెప్పారు.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ ``ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి... ఇలాంటి లెజెండ్స్ ఎవ‌రైనా  ఫొటోగ్రాఫ‌ర్లు తీసిన అంద‌మైన స్టిల్స్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన‌వాళ్లే. స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్లంటే నాకు ప్ర‌త్యేక‌మైన అభిమానం. పాట‌లు జ‌రిగేట‌ప్పుడు, సీన్లు జ‌రిగేట‌ప్పుడు లొకేష‌న్ల‌లో ఫొటోలు తీయ‌డానికి మాత్ర‌మే వారు ప‌రిమితం కాదు. ద‌ర్శ‌కుడి ఊహ‌కు అనుగుణంగా కొన్ని సార్లు ఆర్ట్ డైర‌క్ట‌ర్ల‌కు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ చిత్రానికి ప‌నిచేసినా, దాన్ని సొంత సినిమాగా భావించి ప‌నిచేస్తారు`` అని తెలిపారు.
 
ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు, డైర‌క్ట‌ర్ ర‌సూల్‌ ఎల్లోర్ మాట్లాడుతూ ``స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్లు నాకు సోద‌రులులాంటివాళ్లు. వాళ్ల  కార్య‌క్ర‌మానికి న‌న్ను పిల‌వ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. చరిత్ర రాయ‌డానికి ఫొటోగ్ర‌ఫీ ముఖ్య ఆధారం`` అని చెప్పారు.
సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల‌తో త‌న‌కున్న అసోసియేష‌న్‌ను ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, హీరో `అల్ల‌రి` న‌రేష్ గుర్తుచేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భీమవరంలో భారీ కుంభకోణం.. రూ.370 కోట్ల రుణం తీసుకుని?