హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. భీకర దాడులు చేసింది. ఈ యుద్ధంలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. భారత విదేశాంగ వర్గాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా దాదాపు 18 వేల మంది విద్యార్థులు చిక్కుకున్నారని, వీరి రక్షణపై భారత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిపై విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ, శనివారం రాత్రి వరకు మాకు చాలా సందేశాలు వచ్చాయి. వీటిని రాత్రంతా సేకరిస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ప్రధానిమంత్రి సైతం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. అదేసమయంలో ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులంతా సురక్షితంగా ఉండాలని సూచించారు.
అయితే, భారతీయ విద్యార్థులు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు విద్యార్థులను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య కాల్పులు భీకర కాల్పులు జరుగుతుండటంతో పరిస్థితి భీకరంగా కనిపిస్తుంది.