Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ
, మంగళవారం, 16 నవంబరు 2021 (18:38 IST)
మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది. అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 

 
సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట, ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట, పెరుగు, జలచరమాంసాదులు, పాలు, బెల్లం, తీపివస్తువులు, కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట, శరీరానికి శ్రమ లేకపోవుట, పగటినిద్ర మరియు శీతల, మధుర, స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 

 
ఆరోగ్యవంతుని యందు ఒక పగలు, రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీగా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును.

 
మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది. 
 
1 - సహజము.
 
 2 - అపథ్య నిమిత్తజము. 
 
సహజము-
సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము, శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 

 
అపథ్య నిమిత్తజము- 
 
ఇది బీజదోష రహితముగా, జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 

 
మధుమేహము నందు మూత్రము కషాయ, మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధి తీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 

 
కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum), పిత్తాశయం ( Gallblader )నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును.


మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం, కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును. రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత, కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును. సక్రమమైన ఆహారవిహారాలు, క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును.

 
మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాలు. 


తినవలసిన ఆహారపదార్ధాలు- 
యవలు, గోధుమలు, కొర్రలు, రాగులు, పాతబియ్యపు అన్నం, పెసలు, చేదు గల కాయగూరలు మరియు ఆకుకూరలు, చేదుపోట్ల, కాకరకాయ, మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు, నేరేడు విత్తనాలు, ఉసిరిక పండు, పసుపు, అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు. 

 
తినకూడని ఆహార పదార్దాలు- 
కొత్త బియ్యపు అన్నం, అధిక నూనె కలిగిన ఆహారాలు, బెల్లపు పదార్దాలు, నెయ్యి వంటకములు, మద్యము, గంజి, చెరుకు రసము, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న, జున్ను, దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు, ధూమపానం, రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం. మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   

 
పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యోనిలో నిమ్మకాయ రసం పిండితే గర్భం రాదా?