మనదేశంలో ట్రాఫిక్ జామ్‌లకు ఏమాత్రం కొదవవుండదు. వాహనాలు నడిపే వారిలో నిర్లక్ష్యం కారణంగా, తగినన్ని బ్రిడ్జిల నిర్మాణాలు లేకపోవడం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటాయి. తాజాగా మనదేశంలో ట్రాఫిక్ జామ్‌పై కొత్త రికార్డు నమోదైంది. అది ఎక్కడంటే.. మహాకుంభమేళాలో. అవును.. మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో భక్తుల రద్దీ సామాన్యంగా లేదు. ఈ భక్తుల రద్దీ కారణంగా గంగానదిలో కాలుష్యం ఓ వైపు జరుగుతుంది.
పవిత్ర స్నానాలు పక్కనబెడితే భారీగా జనాలు గంగమ్మ తల్లిని కలుషితం చేస్తున్నారని చెప్పాలి. ఎన్నో ఏళ్లు తర్వాత జరిగే ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాల కోసం యూపీకి వచ్చేస్తున్నారు భారీ జనం. అక్కడికి వచ్చే జనాల కారణంగా కాలుష్యం తాండవం చేస్తుంది. పారిశుద్ధ్య ఏర్పాట్లు ఎంత చేసినా సరిపోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మహాకుంభమేళా పేరిట పవిత్ర ప్రదేశాలు జనాల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా తయారవుతున్నాయని నాస్తికులు అంటున్నారు.
ఇంకా గంగమ్మ తల్లిని తలుచుకుని ఇంట్లోని నీటిని నెత్తిన చల్లుకున్నా కలియుగంలో కోట్ల రెట్ల పుణ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పవిత్ర స్నానం పేరిట గంగమ్మను అపవిత్రం చేసే కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని వారు అంటున్నారు.
సరే ఈ విషయాలను పక్కనబెడితే.. 144 ఏళ్ల తర్వాత జరిగే ఈ మహా కుంభమేళాలో ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది జనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ నెలకొంది.
వందలాది కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. కోట్లాది మంది భక్తులు కుంభమేళా వైపు వెళ్తుండటంతో ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ నెలకొంది. కేవలం 50 కిలోమీటర్ల దూరానికే 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు కుంభమేళా ప్రాంతానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.