మాతృత్వాన్ని మరిచి రాక్షత్వాన్ని ప్రదర్శించింది ఓ తల్లి.. భర్త ఫోన్ తీసుకున్నాడని కోపంలో ఆరు నెలల పసికందుని ఆ కసాయి తల్లి ఏం చేసిందంటే..?
ఈ సృష్టిలో మాతృప్రేమ ఎంతో గొప్పది. అందుకేనేమో తల్లిని మించిన దైవం లేదని అంటారు పెద్దలు. తల్లి చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వాత్సల్యం ఇంకెవ్వరు అందించలేరు. ఈ ప్రపంచంలో కేవలం మనుషులే కాదు.. అనేక జీవరాశులు కూడా తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. నవమాసాలు మోసి కనీ పెంచిన తన బిడ్డకు ఎటువంటి ఆపద కలిగినా ఆ తల్లి పేగు విలవిల లాడుతుంది.
ఏ తల్లి తన బిడ్డకు అపకారం చేయాలని కలలో కూడా ఊహించదు. అలాంటి పవిత్రమైన తల్లి ప్రేమకు చిత్తూరు జిల్లాలో ఓ తల్లి కళంకం తెచ్చింది. తన చేతిలో ఉన్న మొబైల్ ఫోనుని భర్త తీసుకున్నాడనే కోపంతో ఆరు నెలల కుమార్తెను నేలకేసి కొట్టి చంపేందుకు ప్రయత్నం చేసింది. పసికందుకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లా, పెద్దమండ్యం మండలం, సిద్దవరం గ్రామానికి చెందిన దీపిక, రెడ్డప్పలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరి దాంపత్య జీవితానికి నిదర్శనంగా ఆరు నెలల కుమార్తె కూడా ఉంది. పెళ్ళైన నాటి నుండి చిన్నపాటి గొడవలు వచ్చినా అన్ని మరిచి సర్దుకుపోతూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. దీపిక కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఎక్కువగా ఫోన్ తోనే గడిపేది. అయితే కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత కూడా ఎక్కువగా ఫోన్ చూసుకుంటూ కుమార్తెను ఏమాత్రం పట్టించుకునేది కాదు.
ఈ క్రమంలో రెడ్డప్ప, దీపిక మధ్య తరచూ గొడవలు తలెత్తుతూ వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని రెడ్డప్ప దీపిక తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో దీపిక తల్లిదండ్రులు కూడా దీపికను గట్టిగా మందలించారు. భర్త ఇంటిలో ఉన్న సమయంలో ఫోన్ను కనీసం చూసేది కూడా కాదు. దీంతో రెడ్డప్ప తన భార్యలో మార్పు వచ్చిందనే భావించాడు. కానీ ఇంటిలో భర్త లేని సమయంలో దీపిక ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసేది.. అయితే యధావిధిగా రెడ్డప్ప కూలీ పనుల కోసం సిద్దం అవుతున్న సమయంలో దీపిక ఫోన్ మాట్లాడుతూ కనీసం కుమార్తె ఏడుస్తుందని కనికరం కూడా లేకుండా ఫోన్లో మాట్లాడుతూ వుంది.
దీనిని గమనించిన రెడ్డప్ప భార్య చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను లాగేసి గట్టిగా మందలించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన దీపిక భర్తతో గొడవకు దిగి కూలీ పనుల కోసం గ్రామంలోని శివారు ప్రాంతంలోని పంట పొలాల వద్దకు వెళ్ళింది. అయితే కొద్ది సేపటికి ఆరు నెలల చిన్నారి పాల కోసం ఏడవడంతో భార్య కోసం కూలీ పని చేస్తున్న ప్రాంతానికి రెడ్డప్ప కుమార్తెను తీసుకెళ్ళాడు. భర్త మందలించాడని కోపంగా ఉన్న దీపిక పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారిని ఒక్కసారిగా నేలకేసి కొట్టింది. ఈ ఘటనను చూసిన తోటికూలీలు దీపికను మందలించారు.
దీపిక పసిపాపను నేలకేసి కొట్టడంతో పసికందుకు తల భాగంలో, భుజానికి బలమైన గాయాలు అయ్యాయి. దీంతో రెడ్డప్ప, తన సోదరితో కలిసి 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిన వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో పసికందును తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. అయితే దీపికపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దీపికపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.