ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగిస్తుంది. ప్రపంచంలో రోజువారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఏకంగా 62 వేలు దాటిపోయాయి.
నిజానికి గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాం. ఆ తర్వాత కరోనా డెల్టా వేరియంట్‌తో అమెరికా వంటి అగ్రదేశాలు తల్లడిల్లిపోయాయి. ఇపుడు కొత్తగా ఒమిక్రాన్ వైరస్ పురుడుపోసుకుంది. తొలుత సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్.. క్రమంగా ఇపుడు 90కు పైగా దేశాలకు వ్యాపించింది.
తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 62 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మరోమారు డేంజర్ బెల్స్ మోగడం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, బ్రిటన్‌లో ఒక్కరోజే ఏకంగా 10 వేల ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, ఈ దేశంలో ఒమిక్రాన్ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో యూకే పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ప్రస్తుతం యూకేలో 37,101 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 15,452, నార్వేలో 2,060, భారత్‌లో 152, సౌతాఫ్రికాలో 1247 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కూడా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకలపై ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి.