తమ దేశంలో ఇతర దేశాలతో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌లను తటస్థ వేదికలపై నిర్వహించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆతిథ్యానికి తమ దేశం పూర్తిగా సురక్షితమని పేర్కొంది.
'పాకిస్థాన్‌లో భద్రత పరిస్థితి సాధారణంగానే ఉంది. అంతర్జాతీయ జట్లకు ఆతిథ్యమిచ్చేందుకు అన్ని వసతులు ఉన్నాయి. ఇకమీదట తటస్థ వేదికలు మాకొద్దు' అని పీసీబీ అధికారి తెలిపాడు.
కాగా, గత 2009లో పాక్‌లో శ్రీలంక బృందంపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో పర్యటనకు అన్ని జట్లు విముఖత చూపించాయి. తమ దేశంలో జరగాల్సిన సిరీస్‌లను యూఏఈలో పాక్ నిర్వహిస్తూ వచ్చింది.
కొన్నేళ్ల తర్వాత మెల్లిగా పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. పీఎస్‌ఎల్ కూడా జరుగుతోంది. అయితే ఇటీవల భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లు తమ పర్యటనల్ని రద్దు చేసుకోవడంతో పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
మరోవైపు, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలు టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ జట్టు పాకిస్థాన్ - తాలిబన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ఆడాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది.