తమ క్రికెట్ జట్టును అనుమతించని పక్షంలో భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీ జరుగకుండా అడ్డుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఇదే అంశంపై పీసీబీ ఛైర్మన్ ఎహసాన్ మణి మాట్లాడుతూ, భారత్ వేదికగా ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగనుందన్నారు. ఈ టోర్నీలో ఆడేందుకు తమ దేశ జట్టును అనుమతించనిపక్షంలో టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని హెచ్చరించారు.
తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదికూడా మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని కోరారు.
ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. 'ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం' అంటూ మని చెప్పుకొచ్చారు.