ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం రాత్రి ఆతిథ్య పాకిస్థాన్, భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో కివీస్ జట్టు పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది. అలాగే, భారత్ బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లను ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో భారత్, కివీస్ జట్లు దూసుకెళుతున్నాయి. అయితే, సోమవారం బంగ్లాతో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టే జట్లను ఖరారు చేయనుంది.
ప్రస్తుతం సెమీ ఫైనల్‌పై కన్నేసిన కివీస్ జట్టు సోమవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో కివీస్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పైగా, మంచి రన్‌రేట్‌ను కూడా కలిగివుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పరంగా రెండో స్థానంలో ఉంది.
మరోవైపు, బంగ్లాదేశ్ జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. గ్రూపులో మూడో స్థానంలో వుంది. పైగా, అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కివీస్ జట్టును బంగ్లా కుర్రోళ్లు అడ్డుకోవడం అంత ఈజీకాదు. అయితే, గత చాంపియన్స్ ట్రోఫీలో కివీస్ జట్టును బంగ్లాదేశ్ ఓడించి సంచలనం సృష్టంచింది.
ఈ మ్యాచ్‌తో గ్రూపు-ఏలో సెమీస్ బెర్తులు తేలిపోయే అవకాశం ఉంది. కివీస్ గెలిస్తే ఆ జట్టుతో పాటు టీమిండియా జట్లు సెమీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అపుడు ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివుంది. కివీస్ ఓడితే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రేసులో ఉంటాయి.