చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (23)లను భారత బౌలర్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవనియ్యలేదు. ఆ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ 75 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 62 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 77 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశారు.
ఈ జోడీ మూడో వికెట్‌కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సల్మాన్ అఘా (19), ఖుష్ దిల్ షా (38) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో భారత ముంగిట 242 పరుగుల విజయలక్ష్యాన్ని దాయాది దేశం ఉంచింది.