కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వైరస్‌ను అడ్డుకోవడంలో భారతదేశం ప్రణాళికాబద్ధంగా చేస్తోందన్న విశ్వాసం ప్రపంచ దేశాల్లో బలపడుతోంది. దీనితో భారతదేశ సాయాన్ని అవి కోరుతున్నాయి. “కరోనా వైరస్” ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి.
“వైరస్” వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై “ప్రపంచ ఆరోగ్య సంస్థ”తో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపిస్తోంది. భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే “హైడ్రాక్సీ క్లోరోక్వీన్”తో పాటు, “పారాసిట్‌మాల్” ఔషధాన్ని “కరోనా” బాధితులకు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని తిరిగి గాడిలో పెడుతోంది.
దీనితో “హైడ్రాక్సీ క్లోరోక్వీన్” మెడిసిన్‌ను తమకు కూడా ఎగుమతి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ స్వయంగా ఫోన్ చేశారు. అమెరికా, సార్క్ దేశాలతో పాటు మరో 30 దేశాలు భారత్ సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. “హైడ్రాక్సీ క్లోరోక్వీన్”పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి.. తమకు సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
మానవతా దృక్పథంతో సరఫరాపై ఉన్న నిషేధాన్ని సడలించాలని భారత ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.