కరోనా నుంచి తప్పించుకునేందుకు స్వీడన్ ప్రపంచ దేశాలకు అతీతంగా నిలిచింది. స్వీడెన్ ప్రజల జీవన విధానమే ఆ దేశంలో కరోనా రక్కసి నుంచి కాపాడింది. ఇతర దేశాల్లో జనాలు గుంపులు గుంపులుగా గడపడానికి ఇష్టపడతారు. కానీ, స్వీడిష్ ప్రజలు గుంపులుగా బతకడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎవరి సొంత ప్రపంచంలో వారు బతకడానికే ఇష్టపడతారు. ఇదే వారిని కరోనా వైరస్ నుంచి రక్షించేలా చేసింది.
ప్రజలంతా ఎవరికి వారు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న కొద్దిపాటి చర్యలు కరోనా విస్తరణను అడ్డుకుంటున్నాయి. అంత మాత్రాన ఆ దేశానికి కరోనా సోకలేదని కాదు. ఇప్పటి వరకు ఆ దేశంలో 3,700 కేసులు నమోదు కాగా... 110 మంది మరణించారు. కరోనా ఉన్నప్పటికీ... ఎలాంటి భయం లేకుండా ఆ దేశ వాసులు గడుపుతున్నారు. లాకౌ డౌన్ లేకుండా, సరిహద్దులు మూత పడకుండా స్వీడన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే అన్ని దేశాల మాదిరే వర్క్ ఫ్రమ్ హోమ్ కు అక్కడి ప్రభుత్వం సూచించింది.
అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. కస్టమర్లు కూర్చున్న చోటుకే పదార్థాలను అందించాలని అన్ని రెస్టారెంట్లు, బార్లు, కేఫ్‌లను ఆదేశించింది. 50 మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించింది. యూనివర్శిటీలు, కాలేజీలను మూసేసింది. అయితే, 16 ఏళ్ల లోపు విద్యార్థుల కోసం అన్ని స్కూళ్లు పని చేస్తున్నాయి.
వ్యాపార సముదాయాలను బంద్ చేయకపోయినా.. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించక పోయినా కరోనా అంటే స్వీడన్ ప్రజలు జడుసుకోవట్లేదు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రజలే అప్రమత్తంగా వుంటున్నారు. ఇలా కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్త పడుతున్నారు.