Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 గంటల్లో 240 కేసులు... ఏపీలో కొత్తగా 43 - హాట్‌ స్పాట్‌‌ల గుర్తింపు

12 గంటల్లో 240 కేసులు... ఏపీలో కొత్తగా 43 - హాట్‌ స్పాట్‌‌ల గుర్తింపు
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:02 IST)
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు ఎక్కువైంది. గత 24 గంటల్లో 240 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ సంఖ్యతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1637కు చేరింది. ఇందులో 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, తెలంగాణలో 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారే. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి నివారణకు ఉపకరించే వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, వ్యాక్సిన్ తయారీ దిశగా ప్రభుత్వ సారథ్యంలో సన్నాహాలు సాగుతున్నాయని తెలిపారు.
 
దేశంలో విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తిస్తున్నామని, వారిని క్వారంటైన్‌‌కు తరలించే ప్రక్రియ కూడా పకడ్బందీగా సాగుతోందని ఆయన అన్నారు. వైరస్‌ అధికంగా వ్యాపించిన హాట్‌ స్పాట్‌‌లను ఇప్పటికే గుర్తించి, వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని, వైద్య సిబ్బంది రక్షణకు ఉపయోగపడే పరికరాలను సైతం పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు.
 
కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల సహకారంతో దీన్ని పారద్రోలుతామన్న ఆశాభావాన్ని లవ్ అగర్వాల్ వ్యక్తం చేశారు. ప్రజలంతా మాస్క్‌లను ధరించాల్సిన అవసరం లేదని, దగ్గు, జలుబు ఉంటేనే వాటిని ముఖానికి ధరించాలని సూచించారు. ఇదేసమయంలో సామాజిక దూరం పాటించడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక సీఎం ఏడాది వేతనం విరాళం