మానవాళికి పెనుముప్పుగా కరోనా... 204 దేశాలకు వ్యాప్తి.. 50 వేల మంది మృతి

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:51 IST)
మానవాళికి కరోనా వైరస్ పెనుముప్పుగా మారింది. ఈ వైరస్ దేశాల సరిహద్దులను యధేచ్చగా దాటిపోతోంది. ఫలితంగా ఇప్పటివరకు ఏకంగా 204 దేశాలకు వ్యాపించింది. పైగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారానికి ఈ సంఖ్య 52982కు చేరింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1014256గా ఉన్నాయి. 
 
ముఖ్యంగా ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,242 కాగా, మృతుల సంఖ్య 13,915కి పెరిగింది. స్పెయిన్ లోనూ ఇదే తరహా భయానక పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,065 కాగా, మృతిచెందిన వారి సంఖ్య 10,348.
 
ఇక పాజిటివ్ కేసుల విషయానికొస్తే అగ్రరాజ్యం అమెరికా ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడక్కడ 2,44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,886 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. 59,105 పాజిటివ్ కేసులు నమోదవగా, 5,387 మంది మరణించారు. 
 
భారతదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మానవాళికి శత్రువులు.. ఎన్ఎస్ఏ కింద కేసులు : సీఎం యోగి